News4th Apr 05:40 PMSunil Byrisetty1 min read
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆ
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితిగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో వైద్యసేవల్ని మరింత విస్తృత పరచాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు.
పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు.
ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి చాలావరకు బయటపడవచ్చన్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు.