News29th Oct 10:33 AMSunil Byrisetty1 min read

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు టాస్క్‌ఫోర్స్

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బ

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు టాస్క్‌ఫోర్స్
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 475 మందితో కూడిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఈ రెండు జిల్లాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మొత్తం 100 ప్రత్యేక బృందాలను కేటాయించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 55 బృందాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 45 బృందాలను పంపనున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందిని ఈ పనుల కోసం కేటాయించారు. క్షేత్రస్థాయిలో నాలుగేసి మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను ముందుకు తీసుకువెళ్లనున్నారు. తుపాను కారణంగా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్, క్లోరినేషన్ చేపట్టడం వంటి పనులకు ఈ ప్రత్యేక బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
Scroll for the next article