News3rd Jan 02:27 PMSunil Byrisetty1 min read
తెలుగు కేవలం భాష కాదు.. అది మన జీవన సంస్కృతి
తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం మరియు సంస్కృతి అని ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఉద్ఘాటించారు. గుంటూరు సమీపంలోని
తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం మరియు సంస్కృతి అని ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఉద్ఘాటించారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న '3వ ప్రపంచ తెలుగు మహాసభల' ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి తరం పిల్లలకు మన ఆచారాలు, సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమ్మలు చందమామను చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారని, కానీ నేడు సెల్ ఫోన్లను చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి దాపురించిందన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో, జరుపుకునే పండుగల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని గుర్తుచేశారు. గ్రామాల్లో ఒకప్పుడు సంక్రాంతి, దసరా, ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలు వస్తే పండగ వాతావరణం ఉట్టిపడేదని, హరిదాసులు, గంగిరెద్దులతో సందడిగా ఉండేదని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ నేడు గ్రామాల్లో ఆ కళ కనుమరుగవుతోందన్నారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకుంటూ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.