Health9th Sep 04:05 PMSunil Byrisetty1 min read
ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం
ఆత్మహత్యల నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ బహుముఖ చర్యలు చేపడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సకాలంలో కౌన్సెలింగ్‌తోపాటు వృత్తిపరమైన మానసిక ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఆత్మహత్యల
ఆత్మహత్యల నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ బహుముఖ చర్యలు చేపడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సకాలంలో కౌన్సెలింగ్‌తోపాటు వృత్తిపరమైన మానసిక ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఆత్మహత్యల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడేలా, సహాయం కోరడం సహజమైన విషయంగా భావించేలా అవగాహన కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాలు, వృద్ధాశ్రమాల్లో అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలను గుర్తించేలా శిక్షణ ఇస్తోంది. అవసరమైన వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆత్మహత్యల నివారణకు చేపట్టే చర్యల్లో కుటుంబాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సిబ్బంది, సమాజం సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2023 నుంచి 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 463, కళాశాలల్లో 308 ఆత్మహత్యల నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా సుమారు 40,740 మంది పాఠశాల విద్యార్థులు, 35,598 మంది కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. 307 సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో కార్యక్రమాలు నిర్వహించి 17,308 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా కౌన్సెలింగ్ అందించారు. 3,086 మంది ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ప్రమాద సంకేతాలను గుర్తించే అంశాలపై అవగాహన కల్పించారు. సబ్‌జైళ్లు, జువైనల్ హోమ్స్‌లోనూ 266 అవగాహన, నివారణ కార్యక్రమాలు నిర్వహించారు.