News11th Jul 11:11 AMSunil Byrisetty1 min read
ఉచిత బస్సుపై ఆర్టీసీ అంచనాలు
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? వాటిలో ప్రయాణించేవారు ఎందరు? ఉమ్మడి జిల్లా పరిధిలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే ఎంతమందికి లబ్ధి చేకూరుతుందన్న దానిపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగుతో పాటు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో 88 శాతం ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించారు. మిగిలిన బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎక్కువ మంది మహిళలకు మేలు కలగనుందని భావిస్తున్నారు. ఆర్టీసీ గ్రామీణ, సిటీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కలిపి ప్రస్తుతం రోజుకు 16.11 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తే ప్రయాణికుల సంఖ్య 26.95 లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఆర్టీసీపై నెలకు రూ.242 కోట్ల మేర భారం పడుతుందని, దానిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు.