News30th Nov 04:48 PMSunil Byrisetty1 min read
'హెచ్ఐవీ' నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం
హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) నిర్దేశించిన 80% లక్ష
హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) నిర్దేశించిన 80% లక్ష్యంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) 76.96% సాధించిందని తెలిపారు. అలాగే సాధారణ జనాభాలో పరీక్ష వచ్చిన వారిలో హెచ్ఐవీ పాజిటివిటీ రేటు 2015-16లో 2.34% ఉండగా 2024-25 నాటికి అది 0.58%కు తగ్గిందని వెల్లడించారు. కండోమ్ వంటి సురక్షిత విధానాలపై తీసుకొచ్చిన అవగాహన వంటి చర్యలవల్ల పాజిటివిటీ తగ్గుతూ వస్తుందని పేర్కొన్నారు. 2010లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాలతో పోల్చితే 2024-25 నాటికి 88.72% తగ్గినట్లు న్యాకో ఇటీవల జారీచేసిన 2024-25 వార్షిక అంచనాల్లో పేర్కొందని సత్యకుమార్ వెల్లడించారు. గర్భిణుల్లో హెచ్ఐవీ పాజివిటీ రేటు 2015-16లో 0.10% ఉండగా 2024-25 నాటికి 0.04%కు తగ్గిందని చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ దినం (డిసెంబరు-1, సోమవారం) పురస్కరించుకుని మంత్రి ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న హెచ్ఐవీ కేసుల్లో మహారాష్ట్ర (3,62,392) తరువాత ఏపీ (2,75,528) రెండో స్థానంలో ఉంది. అయితే కొత్త కేసులు పెరగకుండా నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి పురోగతిని సాధిస్తోంది. మరోవైపు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 42,008 మంది ప్రభుత్వ పింఛన్లు పొందుతున్నారు.