TTD12th Oct 10:30 AMSunil Byrisetty1 min read
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 12 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా సేనాధిపతి అయిన శ
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 12 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు. ఈ కారణంగా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. అత్రి అనే మహర్షి తన సముర్తార్చన అధికరణ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు.