News2nd Apr 12:34 PMSunil Byrisetty1 min read
బర్డ్‌ఫ్లూ వైరస్‌తో రెండేళ్ల చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు!
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్‌తో రెండేళ్ల చిన్నారి మరణించింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల ఈ మరణం సంభవించినట్లు గుర్తించారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్న
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్‌తో రెండేళ్ల చిన్నారి మరణించింది.
పచ్చి కోడి మాంసం తినడం వల్ల ఈ మరణం సంభవించినట్లు గుర్తించారు.
బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.
నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితిలో మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు.
అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
మార్చి 16న మృతిచెందింది. వైద్యారోగ్య శాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను విచారించగా పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు. చిన్నారిలో ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండురోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్యశాఖ జ్వర సర్వే చేసి, అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని తేల్చింది.