News12th Mar 06:12 PMSunil Byrisetty2 min read
శ్రీవారి కల్యాణానికి ఏర్పాట్లను పూర్తి చేయాలి
ఈ నెల 15 వ తేదీన వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశిం
ఈ నెల 15 వ తేదీన వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం టీటీడీ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మితో కలసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణంపై వెంకటపాలెం సమీపంలోని గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కల్యాణ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, కల్యాణ వేదిక పరిసరాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు.
కల్యాణానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని ఆదేశించారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుండి భక్తులు సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వామివారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కొరకు శ్రీనివాస కల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటలనుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు.
అనంతరం ఆయన అధికారులతో కలసి కల్యాణ వేదిక, తదితర పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.