Health8th Oct 06:09 PMSunil Byrisetty1 min read
ఎన్‌టీఆర్ బేబీ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లుల శిశువులకు అందించనున్న ఎన్‌టీఆర్ బేబీ కిట్ల పంపిణీని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లుల శిశువులకు అందించనున్న ఎన్‌టీఆర్ బేబీ కిట్ల పంపిణీని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శిశువులకు పుట్టినప్పటి నుంచి అవసరమైన ప్రాథమిక సంరక్షణ వస్తువులను ఒకే కిట్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు.
మంగళగిరిలోని వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఎన్‌టీఆర్ బేబీ కిట్ల బ్యాగుల రకాలను మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు బేబీ కిట్ల గురించి మంత్రికి వివరించారు. కిట్లలో చేర్చిన వస్తువుల నాణ్యత, పరిమాణం, శిశువులకు వాటి ఉపయోగాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శిశువుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు ఉపయోగపడే నాణ్యమైన వస్తువులనే కిట్లలో అందించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లుల శిశువులకు ఈ కిట్లను అందించేందుకు ఏటా రూ.51.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా సుమారు 2.45 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఒక్కో ఎన్‌టీఆర్ బేబీ కిట్ ధర రూ.1,400.22గా ఉందన్నారు.
శిశువు జన్మించిన తొలి రోజుల్లో వెచ్చదనం, పరిశుభ్రత, భద్రత కల్పించడంతో పాటు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా శిశువు సంరక్షణకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా కిట్‌ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కిట్లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.