Spiritual15th Jul 03:40 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా 'ఆషాఢ సారె'
కనకదుర్గమ్మ క్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై పరమ పవిత్రమైన ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవంలో భాగంగా దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానా
కనకదుర్గమ్మ క్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై పరమ పవిత్రమైన ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవంలో భాగంగా దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను అత్యంత వైభవంగా సమర్పించారు. సనాతన ధర్మంలో ఆషాఢ మాస సారె సమర్పణకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి, ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సంభారాలను భక్తితో సమర్పించడం హైందవ సంప్రదాయం. దేవదేవుడైన మల్లేశ్వరస్వామి అర్ధాంగి అయిన జగన్మాతకు భక్తులు, వైదిక సిబ్బంది సమర్పించే ఈ సారె, లోకకల్యాణాన్ని, సకల శుభాలను చేకూరుస్తుందని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారెతో ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఘాట్ రోడ్ లోని 'ఓం మలుపు' నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబసభ్యులతో కలిసి సారె సంభారాలను నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, వేద పండితుల మంత్రోచారణల నడుమ అత్యంత శోభాయమానంగా ఆలయానికి విచ్చేశారు. ప్రధాన ఆలయ చిన్న రాజగోపురం వద్దకు చేరుకున్న వైదిక బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనస్వాగతం పలికి, మర్యాదలతో అమ్మవారి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు.