News21st Sep 05:32 PMSunil Byrisetty1 min read
బంగాళాఖాతంలో అల్పపీడనం.. హోంమంత్రి అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్రవాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తుల నిర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్రవాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. తీవ్ర వాయుగుండంప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి తెలిపారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హోంమంత్రి సూచించారు. ఒడిశా సరిహద్దు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF), ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.