News17th Aug 05:00 PMSunil Byrisetty1 min read
ఉత్తరాంధ్ర అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ క
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంతో రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతమైందని ప్రశంసించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యాల విస్తరణ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు నిలువెత్తు రూపమని కొనియాడారు. ఈ విమానాశ్రయం మూలంగా కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించాలని కోరుకుంటున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదిగి, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ అన్నారు.