News25th Oct 03:05 PMSunil Byrisetty2 min read

సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం అండ

ఆంధ్రప్రదేశ్‌ను సెమికండక్టర్‌ డిజైన్‌ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ హ

సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం అండ
ఆంధ్రప్రదేశ్‌ను సెమికండక్టర్‌ డిజైన్‌ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సెమికండక్టర్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, సామర్థ్యాల పెంపునకు మద్దతు అందిస్తామని తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్ధి, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోనూ సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో రైల్వే శాఖ చేపట్టిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే పెండింగ్ లోని వివిధ పనులకు సంబంధించిన డీపీఆర్‌ లకు ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోర్టుల నుంచి వివిధ ప్రాంతాలకు సరకు రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు తొమ్మిది పోర్టులకు అవసరమైన కనెక్టివిటీని ఏర్పాటు చేసేలా కేంద్ర మంత్రి ఆమోదం తెలియచేశారు. సెమీ కండక్టర్‌ డిజైన్‌, పరిశోధన, అభివృద్ధితో పాటు ఈ రంగంలో శిక్షణ అందించేందుకు కూడా ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు ముఖ్యమంత్రి పలు ప్రతిపాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి రూ.3,197 కోట్లు, కొవ్వూరు–భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు రూ.2,860 కోట్లు, ఒంగోలు–దొనకొండ రైల్వే ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు, అనకాపల్లి–కొత్తవలస బైపాస్‌ ప్రాజెక్టుకు రూ.2,190 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సీఎం వివరించారు.
Scroll for the next article