News22nd Sep 12:13 PMSunil Byrisetty1 min read
కానిస్టేబుళ్లే పోలీసు వ్యవస్థకు వెన్నెముక
పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి
పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను అందజేశారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయిందని తెలిపారు. వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమన్నారు.