News20th Dec 05:41 PMSunil Byrisetty1 min read
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమం
కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని, దీనికోసం దేశవ్యాప్త ఆందోళన చేపడతామని సిపిఎం పొలి
కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని కొనసాగించాలని, దీనికోసం దేశవ్యాప్త ఆందోళన చేపడతామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారని, దీనిలో కార్మికులకుగానీ, రాష్ట్రాలకుగానీ ఎటువంటి హక్కులూ లేవని, ఉన్నవి కూడా పాక్షికంగానే ఉన్నాయని తెలిపారు. గతంలో కనీసం 100 రోజులు పని పేరుతో 50 రోజులన్నా కార్మికులకు ఉపాధి లభించేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని తెలిపారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులకు ఆటంకమని చెబుతున్నారని, అలాంటిదేమీ లేదని అనేక నివేదికలు, పరిశోధనలు బయటపెట్టాయని తెలిపారు. కూలీరేట్లు పెరిగాయని చెబుతున్నారని, ఆచరణలో కూలీరేట్లు, వేతనాలు తగ్గాయని పేర్కొన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని విమర్శించారు. పథకంలో నిధుల వాటా గతంలో కేంద్రానికి 90 శాతం రాష్ట్రానికి 10 శాతం వాటా ఉండేదని, ప్రస్తుతం 60:40గా మార్చారని తెలిపారు. ఆకలిచావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల మరలా ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.