News30th Oct 04:29 PMSunil Byrisetty1 min read
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తా
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులతో తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకి సంబంధించి డిజైన్ రూపకల్పన, డీపీఆర్ తదితర పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.