Spiritual7th Nov 03:35 PMSunil Byrisetty1 min read
వెలుగుల దీపావళి.. కథనాలెన్నో!
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగల్లో దీపావళి.. ఒకటి. ఇంటి ముందు దీపాలు వెలిగించడం, రంగవల్లులు వేయడం, కొత్త దుస్తులు ధరించడం, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం దీని
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన పండుగల్లో దీపావళి.. ఒకటి. ఇంటి ముందు దీపాలు వెలిగించడం, రంగవల్లులు వేయడం, కొత్త దుస్తులు ధరించడం, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం దీని ప్రత్యేకత. అయితే దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం మాత్రమే కాదు. దీని వెనుక ఎన్నో పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశేషాలు, జీవన సందేశాలు ఉన్నాయి. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుంది. ‘దీపావళి’ అనే పదం సంస్కృతంలోని ‘దీప’ (దీపం), ‘ఆవళి’ (వరుస) అనే పదాల నుంచి వచ్చింది. అంటే వరుసగా దీపాలు వెలిగించడం అని అర్థం. సాధారణంగా ఆశ్వయుజ మాసం చివర్లో లేదా కార్తీక మాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. రామాయణం ప్రకారం.. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని, రావణుడిని సంహరించి సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అయోధ్య ప్రజలు తమ ప్రియమైన రాముడికి స్వాగతం పలికేందుకు ఇళ్లను దీపాలతో అలంకరించి వెలుగులు నింపారని, ఈ విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారని ఉత్తర భారతదేశంలో విశ్వసిస్తారు.దక్షిణ భారతదేశంలో పురాణాల ప్రకారం.. నరకాసురుడు ప్రజలను, దేవతలను తీవ్రంగా హింసించేవాడు. అతడి ఆగడాలను అరికట్టేందుకు శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించారు. అతడి మరణంతో ప్రజలకు విముక్తి లభించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నరక చతుర్దశి, దీపావళి వేడుకలు జరుపుకుంటారు.