News10th Nov 02:09 PMSunil Byrisetty1 min read
డిసెంబరు 10 నుంచి బులుసు అపర్ణ సహస్రావధానం
తెలుగువారికి మాత్రమే సొంతమైన అవధాన ప్రక్రియలో ఇప్పటివరకూ జరగనివిధంగా, తెలుగు భాషా చరిత్రలో తొలిసారిగా తమ కమిటీ పక్షాన మహిళా సహస్రావధానం నిర్వహించబోతున్నట్లు విజయవాడ ఎస్.కె.పి.వి.వి
తెలుగువారికి మాత్రమే సొంతమైన అవధాన ప్రక్రియలో ఇప్పటివరకూ జరగనివిధంగా, తెలుగు భాషా చరిత్రలో తొలిసారిగా తమ కమిటీ పక్షాన మహిళా సహస్రావధానం నిర్వహించబోతున్నట్లు విజయవాడ ఎస్.కె.పి.వి.వి. హిందూ హై స్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య చెప్పారు. అవధాన రంగంలో డాక్టర్ బులుసు అపర్ణ ఇప్పటికే ప్రపంచస్థాయి పేరు పొందారని, డిసెంబరు 10వ తేదీ నుంచి ఆమె సహస్రావధానం చెయ్యబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు చరిత్రలో సహస్రావధానం చేసిన మహిళగా డా. బులుసు అపర్ణ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కెబిఎన్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. టి.శ్రీనివాసు మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పద్మశ్రీ పురస్కార గ్రహీత, బృహత్ ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ సహస్రావధానాన్ని ప్రారంభిస్తారన్నారని, జనవరి 3 న పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు సమక్షంలో ధారణ, విజయోత్సవం జరుగుతాయన్నారు. ‘భారతీపుత్ర’, ‘గురు సహస్రావధాని’ కడిమెళ్ళ వరప్రసాద్ సహస్రావధానానికి సంచాలకులుగా వ్యవహరిస్తారన్నారు. అవధాని డా. బులుసు అపర్ణ మాట్లాడుతూ డిసెంబరు 10 నుంచి 13వ తేదీ వరకు సమస్యలు; డిసెంబరు 14 నుంచి 18వ తేదీ వరకు దత్తపదులు, 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వర్ణన అంశాల స్వీకరణ ఉంటుందని, 23వ తేదీ నుంచి పూరణలు ఉంటాయన్నారు. 2027 జనవరి 3వ తేదీన మొత్తం 750 పద్యాల ధారణ చేస్తామన్నారు.