News5th Jun 02:17 PMSunil Byrisetty1 min read
లోకేష్ రాజీనామా చేయాలి!
పదవ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చిన పరిస్థితిని గతంలో ఎప్పుడైనా చూశామా అని వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్
పదవ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చిన పరిస్థితిని గతంలో ఎప్పుడైనా చూశామా అని వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ప్రశ్నించారు. 16 వేల మంది తమ పేపర్లను కరెక్షన్ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలిందన్నారు. లోగడ ఏనాడైనా అయిదు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులకి కరెక్షన్‌లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా అని ప్రశ్నించారు. మొదట ఇరవై మార్కులు వచ్చి, రీవాల్యుయేషన్ తరువాత తొంబై మార్కులు వచ్చిన ఘటనలైనా కనీసం కనీవినీ ఎరిగి ఉన్నామా అనడిగారు. దీన్ని బట్టి చూస్తుంటేనే పదవ తరగతి జవాబు పత్రాలను అత్యంత బాధ్యతారాహిత్యంగా దిద్దారనే చేదు నిజం ఎవరికైనా ఇట్టే అర్థమవుతోందని వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య భగ్గుమన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నారా లోకేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని.. డిమాండ్ చేశారు.