Health27th Nov 11:40 AMSunil Byrisetty1 min read
చలికాలం జాగ్రత్తలు పాటించాలి: డా. అనూష
చలికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా, ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి గణపతి నగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష సూచించారు. చ
చలికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా, ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి గణపతి నగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష సూచించారు. చలి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. శీతాకాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వైరల్ జ్వరాలు, ఆస్తమా, చర్మం పొడిబారి పోవడం వంటివి ఎక్కువగా వస్తాయన్నారు. చలికాలంలో తేమ శాతం బాగా తగ్గిపోవడంతో చర్మంలోని తేమ ఇగిరి పోయి, చర్మం పొడిబారి పోతుందన్నారు. పెదవులు, చెంపలు చిట్లిపోవడం, కాళ్లు, చేతులలో పగుళ్లు రావడం, దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయన్నారు. పొడి బారిన చర్మంకు మాయిశ్చరైజర్ క్రిములు, కొబ్బరి నూనె రాయాలన్నారు. దాహం వేసినా, వేయకపోయినా నీరు ఎక్కువగా త్రాగాలన్నారు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలన్నారు. చలికాలంలో రక్తనాళాలు, ధమనులు సంకోచించి బీపీ పెరిగి గుండెపోటుకు గురి అయ్యే ప్రమాదాలు ఉన్నాయన్నారు. చలికి కీళ్లు బిగిసిపోయి కదలికలు కష్టంగా చేస్తాయని, దాన్ని నివారించేందుకు కీళ్లను తరచూ కదలిస్తుండాలన్నారు. చలికాలం జీర్ణశక్తి మందగిస్తుందని కూరగాయలు, పండ్లు తీసుకుంటూ కొవ్వులు, పాల ఉత్పత్తులు, మాంసం, తక్కువగా తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, ఆస్తమా రోగులు మంచు పడే సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలన్నారు. చలి నుంచి రక్షణ పొందటానికి ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మాస్కులు, మఫ్లర్లు వాడాలన్నారు. శీతాకాలం సీజనల్ వ్యాధులతో బాధపడేవారు సమీపంలోని హెల్త్ సెంటర్లో ప్రభుత్వం అందించే ఉచిత వైద్య సేవలను పొందాలని డా. అనూష విజ్ఞప్తి చేశారు.