News24th Mar 01:26 PMSunil Byrisetty1 min read

విశాఖలో భారీగా క్రికెట్ బెట్టింగ్‌లు.. రూ.178 కోట్ల లావాదేవీలు

ఐపీఎల్‌ సీజన్‌ మొదలవడంతో బెట్టింగ్‌ ముఠాల ఆగడాలు మితిమీరుతున్నాయి. విశాఖలో భారీగా బెట్టింగులు మొదలయ్యాయి. బెట్టింగ్లో లక్కు ఎవరికో ఒకరికే అన్న సంగతి తెలిసే బెట్టింగులకు పాల్పడుతున్

విశాఖలో భారీగా క్రికెట్ బెట్టింగ్‌లు.. రూ.178 కోట్ల లావాదేవీలు
ఐపీఎల్‌ సీజన్‌ మొదలవడంతో బెట్టింగ్‌ ముఠాల ఆగడాలు మితిమీరుతున్నాయి. విశాఖలో భారీగా బెట్టింగులు మొదలయ్యాయి. బెట్టింగ్లో లక్కు ఎవరికో ఒకరికే అన్న సంగతి తెలిసే బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏపీలో ఎక్కువగా విశాఖలో ఈ బెట్టింగ్‌ ముఠాలకు సంబంధించి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జనవరిలో బెట్టింగ్ గ్యాంగుల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెదవాల్తేరులోని అపార్ట్‌మెంట్‌లో ఒక బుకీ పట్టుబడగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి దాదాపు 80 బ్యాంకు ఖాతాల్లోని రూ.45 లక్షలను సీజ్ చేశారు. నిందితులు బెట్టింగ్‌లను నిర్వహించి రూ.178 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులతో సహా ఒక్కొక్కరిని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి అరెస్టు అయిన నిందితుల సంఖ్య 13కి చేరింది. అరెస్టు అయిన వారిలో ప్రధాన నిందితులు ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉంటోంది. దీంతో వారు ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉండటం గమనార్హం. వీరి వద్ద ఉన్న పాత కాంటాక్టులతో పక్కా ప్రణాళిక వేసుకుని ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు దిగుతున్నట్లు సమాచారం. డిజిటల్‌ లావాదేవీలు కాకుండా నగదు డిపాజిట్లు చేయించుకుని ఒక ఫోన్‌ నంబరు ఇస్తారు. ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే పాతవారైతేనే బెట్టింగ్‌ కలుపుతారు. బుకీలకు తెలియని లేదా కొత్త నెంబర్లు నుంచి ఫోన్లు వస్తే ఆ నెంబర్లను స్విచాఫ్‌ చేస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల మోసపోయినవారు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేస్తామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
IPL Season
Betting
Vizag
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ
Scroll for the next article