News14th Dec 11:20 AMSunil Byrisetty1 min read
నత్తనడకన జల్ జీవన్ ప్రాజెక్టు పనులు
ఎన్‌టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో అమలవుతున్న జల్ జీవన్ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూత్రపిండ
ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో అమలవుతున్న జల్ జీవన్ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ చేపట్టిన ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఫలితంగానే ఈ ప్రాజెక్టు మంజూరైందని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏకొండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు 100 కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్ర ఫలితంగా ఏకొండూరు మండలంలోని 21 గ్రామపంచాయతీలకు, 22 అనుబంధ తండాలకు రూ.50 కోట్లతో జల్ జీవన్ ప్రాజెక్టు పనులు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. రెడ్డిగూడెం మండలంలోని కుదప ప్రాంతంలో ఉన్న కృష్ణా జలాల సంపును సిపిఐ మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఏకొండూరు మండలంలోని కుమ్మరి కుంట్ల, చైతన్య నగర్, మత్రియ తండా ప్రాంతాల్లో జరుగుతున్న జల్ జీవన్ ప్రాజెక్టు పనులను పరిశీలించి, తండావాసులు ముఖ్యంగా మహిళలతో మాట్లాడి తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాలకు ఇంకా మంచినీరు అందడం లేదని స్థానికులు చెప్పడంతో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.