TTD28th Sep 03:21 PMSunil Byrisetty1 min read
మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.