Spiritual25th Sep 12:46 PMSunil Byrisetty1 min read

దేవస్థానం అప్రమత్తంతో తప్పిన ముప్పు

విజయవాడ నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించ

దేవస్థానం అప్రమత్తంతో తప్పిన ముప్పు
విజయవాడ నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల కోసం మూడు రోజులుగా అధికారుల ముందస్తు నిర్ణయంతో ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయడం వలన, శ్రీ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శుక్రవారం ఉదయం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఘాట్ రోడ్డులోని ప్రభావిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. కొండపై నుండి ఘాట్ రోడ్డుపై జారిపడిన భారీ బండరాళ్లు, రాతిపెళ్లలు, మట్టిని వెంటనే పొక్లెయిన్లు, క్రేన్ల సహాయంతో యుద్ధప్రాతిపదికన తొలగించి మార్గాన్ని శుభ్రం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ​కొండచరియల పై వర్షపు నీటి ఊట కారణంగా మట్టి నానిపోయి ఉందని,ఇంకా ఎక్కడైనా కొండచరియలు జారే అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని సాంకేతిక నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉన్న వదులైన రాళ్లను ముందుగానే గుర్తించి నియంత్రిత పద్ధతిలో తొలగించాలని సూచించారు.
Scroll for the next article