News3rd Apr 02:35 PMSunil Byrisetty2 min read
ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం!
గతంలో మంగళగిరిలో జెసిబి పాలన చూశామని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించామని విద్య, ఐటీ శాఖల మం
గతంలో మంగళగిరిలో జెసిబి పాలన చూశామని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ఈరోజు ఉండవల్లిలో తొలిపట్టాను అందజేశానని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్ ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చానన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో స్థానిక ప్రజలు దశాబ్ధాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపితే అక్కడకు వెళ్లి ఇల్లు నిర్మించుకోవడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని అని గుర్తించానన్నారు. వారి కష్టాలు చూశాకే అధికారంలోకి వచ్చాక బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాలు ఇస్తానని చెప్పానని, ఆ హామీని ఈరోజు నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందని వివరించారు. తొలివిడతగా 3వేలమంది శాశ్వత పట్టాలు అందజేస్తున్నామని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా స్వచ్చ మంగళగిరి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్కులు, ప్లేగ్రౌండ్లు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పైప్ లైన్ ద్వారా గ్యాస్ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో మోడరన్ రైతుబజార్ నిర్మాణం, లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధునీకరణ, మంగళగిరి ప్రజల కల అయిన వంద పడకల హాస్పటల్ ను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. త్వరలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. స్థానిక సంస్థల నిధులు, సీఎస్ఆర్ ఫండ్స్‌తో గత పదినెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోకేష్ చెప్పారు.