News4th Nov 03:28 PMSunil Byrisetty1 min read
మురసు తుఫాన్ ప్రభావంతో 162 కి.మీ. రోడ్లు ధ్వంసం
మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా
మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా రహదారులపై పడిపోయిన చెట్ల తొలగింపు, ట్రాఫిక్ పునరుద్ధరణ, దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులకు సంబంధించి మొత్తం 162.841 కిలోమీటర్ల మేర రహదారి ఉపరితలం దెబ్బతిన్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు చోట్ల స్కౌర్స్, నాలుగు చోట్ల రోడ్డు కోతలు, ఐదు కల్వర్టు సంబంధిత పనులు దెబ్బతిన్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో 201 చెట్లు నేలకూలగా, అధికారులు తక్షణమే స్పందించి మొత్తం తొలగించినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో 73 చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడగా, ఇప్పటికే 34 చోట్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే SPSR నెల్లూరు జిల్లాలో 66.600 కి.మీ., NTR జిల్లాలో 52.683 కి.మీ., పశ్చిమ గోదావరి జిల్లాలో 38.572 కి.మీ., ప్రకాశం జిల్లాలో 3.600 కి.మీ., పల్నాడు జిల్లాలో 1.386 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల కోసం మొత్తం రూ.143.36 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో తాత్కాలిక మరమ్మతులకు రూ.16.66 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.126.70 కోట్లు అవసరమని వివరించారు.