News20th Dec 12:25 PMSunil Byrisetty1 min read
పరీక్ష పెట్టే దేవుడు.. జయించే శక్తి కూడా ఇస్తాడు
నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:
నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృపాప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘కృపా సమాజం ఆధ్వర్యంలో కృపా ప్రాంగణం పునర్ నిర్మాణం చేసుకుని ప్రారంభించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. దేవుడు ఒక్కోసారి మనకు పరీక్షలు పెడతాడు. వాటిని జయించే శక్తి కూడా ఆ దేవుడే ఇస్తాడు. మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రిస్మస్ మాసం సందర్భంగా మన ఇంటి పక్కన, వీధిలో, గ్రామంలో ఉన్నవారికి సాయపడదాం. ఒక్కరితో అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాజం కలిసివస్తే కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. 2019లో దేవుడు నాకో పరీక్ష పెట్టాడు. దానిని జయించే శక్తి కూడా ఇచ్చాడు. మంగళగిరిలో కమ్యూనిటీ భవనాలను నిర్మించడంతో పాటు స్మశానాలను అభివృద్ధి చేస్తున్నాం. నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాన’ని మంత్రి చెప్పారు. అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.