Education25th Oct 02:59 PMSunil Byrisetty1 min read
ఎంబీబీఎస్ ప్రవేశాల గడువుపై ఎన్‌ఎంసీ
ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పొడిగింపు, నీట్ యూజీ అర్హత శాతం తగ్గింపు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని జాతీయ వైద్య కమిష
ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పొడిగింపు, నీట్ యూజీ అర్హత శాతం తగ్గింపు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ అనంతరం 112 ఎంబీబీఎస్ సీట్లు (NRI quota) ఖాళీగా మిగలడంతో, ప్రవేశాల గడువును మరో 15 రోజులు పొడిగించాలని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రభుత్వ సూచనల మేరకు ఎన్‌ఎంసీని కోరింది. ఈ విషయమై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎన్‌ఎంసీ ఛైర్‌పర్సన్‌కు, కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వైద్య విద్య)కు లేఖ రాశారు.
2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియను అక్టోబరు 26లోగా పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం మొదటి, రెండో, మూడో విడత (మాప్-అప్) కౌన్సెలింగ్‌తో పాటు స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించింది. అక్టోబరు 23న స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయినా 112 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ యూజీ–2026 అర్హత శాతాన్ని తగ్గించాలని, కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు చివరి తేదీని మరో 15 రోజులు పొడిగించాలని విశ్వవిద్యాలయం ఎన్‌ఎంసీకి విజ్ఞప్తి చేసింది. అక్టోబరు 26న ప్రవేశాల గడువు ముగిసిన తర్వాత లేఖపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంసీ వెల్లడించింది.