News14th Nov 05:16 PMSunil Byrisetty1 min read
పోషకాహార తోటలతో పిల్లల్లో ఆరోగ్యం
నేటి బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో కీలకమని, చిన్న వయస్సు నుంచే విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ సూచించారు. నవంబర్ 14 బా
నేటి బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో కీలకమని, చిన్న వయస్సు నుంచే విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ సూచించారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లలోని డా.బి.ఆర్.అంబేద్కర్ బాలికలు గురుకులంలో నిర్వహించిన బాలల పోషకాహార తోటల పండుగ (Child Nutri-Garden Festival) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విత్తనాలు నాటి, మొక్కలు నాటి పోషకాహార తోటను ప్రారంభించారు. విద్యార్థినులు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పోషక విలువలు కలిగిన మొక్కలను పెంచడం ద్వారా తాజా, సహజమైన ఆహారాన్ని పొందవచ్చని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు, ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నెట్ జీరో కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించడం, మొక్కలను విరివిగా పెంచడం, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, విద్యార్థులు తమ ఇళ్లలో, పాఠశాలల్లో పర్యావరణహిత అలవాట్లను పాటిస్తూ ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవాలని అన్నారు.