News21st Oct 12:21 PMSunil Byrisetty1 min read
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
ప్రజారక్షణ విధుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసుల త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న
ప్రజారక్షణ విధుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసుల త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి, అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలు సంతోషంగా జీవిస్తారని ఆయన అన్నారు. విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, మానప్రాణాల రక్షణలో పోలీసులు చూపిస్తున్న అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. సరిహద్దులో దేశాన్ని కాపాడే సైనికులు ఒక ఎత్తైతే, దేశంలో ప్రజల భద్రతను కాపాడే పోలీసులు మరో ఎత్తు అని వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్నాయుడు, పోలీసుల ధైర్యం, త్యాగం దేశానికి గర్వకారణమని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి, వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.