Politics23rd Aug 09:07 AMSunil Byrisetty1 min read
ప్రకాశ్ రాజ్ “చిలిపి” పోస్టు
నటుడు ప్రకాశ్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' శైలిలో మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఓ కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో గాలి దమారమౌతోంది
నటుడు ప్రకాశ్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' శైలిలో మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఓ కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో గాలి దమారమౌతోంది. ఈ పోస్ట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చకు దారితీస్తోంది. "మహాప్రభూ, ఓ చిలిపి సందేహం" అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌ను ప్రారంభించారు. కొత్తగా ప్రవేశపెట్టే బిల్లు వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారా అని నిలదీశారు. అలాంటి వారిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ పదవిలో కూర్చోబెట్టే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఏ రాష్ట్రం పేరు గానీ, నాయకుడి పేరు గానీ చెప్పలేదు. అయినా ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించేనని అర్ధమౌతోంది. ఆయన వాడిన 'మాజీ ముఖ్యమంత్రి', 'ప్రస్తుత ముఖ్యమంత్రి', 'ఉప ముఖ్యమంత్రి' అనే పదాలే ఈ చర్చకు మూలం. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్షంలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ ముగ్గురి రాజకీయ సమీకరణాలకు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతుండటంతో, నెటిజన్లు ఈ ట్వీట్‌ను ఏపీకి ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు.