News7th Jun 03:44 PMSunil Byrisetty1 min read
7 రోజుల్లో కోటి మందికి పైగా రేషన్
రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా 7 రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప
రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా 7 రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పౌర సరఫరా విధానంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడురోజుల వ్యవధిలో 1,05,27,767 మంది కార్డుదారులకు రేషన్ అందజేయడం జరిగింది. అంటే 72 శాతం మందికి రేషన్ సరుకులు అందజేశామన్నారు. అదేవిధంగా 98,77,670 మంది కార్డుదారులకు పంచదార పంపిణీ చేశారు. ఇది 67.56% అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇప్పటివరకు 11,05,439 మందికి ఈ విధంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమకు అనుకూల సమయాల్లో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు.