Education18th Jul 04:15 PMSunil Byrisetty1 min read
వినూత్న ఆలోచనలతో విజయవంతమైన వ్యాపారాలు
యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు ఆర్టీఐహెచ్ అనేక కార్యక్రమాల ద్వారా విస్తృత సహకారం అందిస్తోందని ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈవో డా. హరిబాబు అన్నారు. విజ
యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు ఆర్టీఐహెచ్ అనేక కార్యక్రమాల ద్వారా విస్తృత సహకారం అందిస్తోందని ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈవో డా. హరిబాబు అన్నారు.
విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) కార్యాలయంలో స్టార్టప్‌లు, మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వెస్టిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 80 మంది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈవో డా. హరిబాబు మాట్లాడుతూ స్టార్టప్‌ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన మార్గదర్శకత్వంతో పాటు నిపుణుల సలహాలు వంటి సేవలను అందిస్తున్నామని వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐపీఆర్ అటార్నీ సుధీర్.. ట్రేడ్‌మార్క్, బ్రాండింగ్, జీఎస్టీ, మేధోసంపత్తి హక్కుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్ధంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను ఉదాహరణలతో సహా వివరించారు. కార్యక్రమం అనంతరం సుమారు పది మంది విద్యార్థులు ఆర్టీఐహెచ్ స్పార్క్ కార్యక్రమంలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.