News15th Nov 04:22 PMSunil Byrisetty1 min read

అక్షర యోధులకు వందనం- నేడు జాతీయ పత్రికా దినోత్సవం

ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజల గొంతుకగా, సమాజానికి దిక్సూచిగా, పాలకుల తప్పిదాలను ఎత్తిచూపే అక్షర ఆయుధంగా పత్రికలు నిలుస్తున్నాయి. అధికారంలో ఉన్

అక్షర యోధులకు వందనం- నేడు జాతీయ పత్రికా దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజల గొంతుకగా, సమాజానికి దిక్సూచిగా, పాలకుల తప్పిదాలను ఎత్తిచూపే అక్షర ఆయుధంగా పత్రికలు నిలుస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ప్రజల సమస్యలను వినిపించడంతో పాటు, పాలనలోని లోటుపాట్లను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికల పాత్ర అనన్యసామాన్యం. అందుకే ప్రజాస్వామ్యానికి పత్రికా రంగం నాలుగో స్తంభంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వార్త ప్రజల చెంతకు చేరాలంటే పత్రిక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. తెల్లవారుజామున ఇంటి ముంగిట పడే దినపత్రిక కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. టెలివిజన్ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వేగంగా వార్తను అందించాలనే పోటీలో వాస్తవాలను నిర్ధారించుకోవడం అత్యంత కీలకంగా మారింది. అసత్య ప్రచారాలు, నిరాధార కథనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరించే ధోరణులు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జర్నలిస్టులు వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, నిష్పాక్షికతను పాటిస్తూ, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరుల పాత్ర ఎంతో కీలకం. మారుమూల పల్లెల్లోని సమస్యలు, రైతుల కష్టాలు, పేదల ఆవేదనలు, విద్యార్థుల ఇబ్బందులు, ప్రజాప్రతినిధుల హామీలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను వెలుగులోకి తీసుకువచ్చేది స్థానిక విలేకరులే. నిరంతరం పనిచేసే జర్నలిస్టుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వాలు, యాజమాన్యాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Scroll for the next article