News6th Nov 04:51 PMSunil Byrisetty1 min read
8న రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి
ఈ నెల 8వ తేదీన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్ష
ఈ నెల 8వ తేదీన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొనట్లు మంత్రి సవిత వెల్లడించారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతలపైనా, కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందకరమన్నారు. గతేడాది అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయింతిని నిర్వహించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.