News10th Nov 02:41 PMSunil Byrisetty1 min read
మొంథా నష్టం.. కేంద్రం ఆదుకోవాలి
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.63
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.6384 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మొంథా తుపాన్ వల్ల వాటిల్లిన నష్టం మదింపు వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమీబసు, కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం ముందుగా అమరావతిలోని సచివాలయానికి వచ్చింది. ఈ బృందానికి సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మొంథా తుపాను కలిగించిన నష్టం గురించి రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్‌లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని తెలిపారు. 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. అలాగే 6,250 హెక్టార్లలో ఉద్యానవన పంటలు , 17.72 హెక్టార్లలో మల్బరీ తోటలకూ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ తుపాన్ కారణంగా మత్స్యకారులు కూడా బాగా దెబ్బతిన్నారన్నారు. ఈ విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్ర ఉదారంగా వ్యవహరించాలని కోరారు.