News25th Nov 05:15 PMSunil Byrisetty1 min read
స్టెమీతో 95.94 శాతం మందికి తప్పిన ప్రాణగండo
గ్రామీణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిన వారికి 'అత్యవసర వైద్యం' (గోల్డెన్ అవర్) కింద స్టెమీ విధానంలో ఇస్తున్న చికిత్సవల్ల గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది
గ్రామీణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిన వారికి 'అత్యవసర వైద్యం' (గోల్డెన్ అవర్) కింద స్టెమీ విధానంలో ఇస్తున్న చికిత్సవల్ల గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది ప్రాణాలు నిలిచాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో 238 ప్రభుత్వ సామాజిక(CHCs), ప్రాంతీయ(AHs), జిల్లా ఆసుపత్రుల్లో(DHs) ప్రవేశపెట్టిన 'స్టెమీ' (ST-segment elevation myocardial infraction) విధానం కింద ఖరీదైన 'టెనెక్టెప్లస్' ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా విలువైన ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. ఛాతీనొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిలో 'టెనెక్టె ప్లేస్' ఇంజక్షన్ అవసరమని గుర్తించిన 3,155 మందిలో 3,027 (95.94%) మంది ప్రాణాలు నిలబడినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు ఇంజెక్షన్ పొందిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమించి ఉండడం, సమయం మించిపోవడం వంటి కారణాలతో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్సీడీ-4.0 సర్వేలో భాగంగా స్టెమీ విధానం అమలుపై ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.ల ద్వారా ఛాతీనొప్పి లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై శిక్షణ ఇవ్వబోతున్నామని మంత్రి సత్యకుమార్ నివేదించారు.