News29th Dec 12:32 PMSunil Byrisetty1 min read
న్యూ ఇయర్ వేడుకలపై.. విజయవాడలో కఠిన ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషన
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ నెల 31 రాత్రి వేడుకల సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధన జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. ముఖ్యంగా యువత అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు.