Politics17th Oct 05:52 PMSunil Byrisetty1 min read

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల సమయంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లను తక్షణమే అప్రమత్తం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు.
Scroll for the next article