News26th Nov 01:43 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లోకి విద్యార్థులు వచ్చి మార్పు తీసుకురావాలి
విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించి, సమాజంలో మార్పు తీసుకురావాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్
విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించి, సమాజంలో మార్పు తీసుకురావాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులచే నిర్వహించిన నమూనా అసెంబ్లీ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... యువగళం పాదయాత్ర సమయంలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగాను. పాదయాత్ర సమయంలో నన్ను అడ్డుకున్న పోలీసులకు ఆర్టికల్ 19లో పొందుపర్చిన రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పాను. వారు అదంతా మాకు తెలీదు, ఎస్పీతో మాట్లాడమని చెప్పేవారు. పిల్లలకు చిన్నవయసులోనే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలియజేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను స్టాన్ ఫోర్డ్ ప్రవేశపరీక్ష సందర్భంగా రాసిన వ్యాసంలో ప్రజాసేవ, పాజిటివ్ లీడర్ షిప్ తో సమాజంలో మార్పువస్తుందని రాశాను. మీరు భవిష్యత్తులో ఏ వృత్తిలోకి వెళ్లినా నైతికతను వీడొద్దు. రాజకీయాల్లో పాజిటివ్ లీడర్ షిప్ తేవడానికి కృషిచేయండి. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లినా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలబడాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.