Politics1st Oct 01:38 PMSunil Byrisetty2 min read

బీసీ రిజర్వేషన్లపై 2 పార్టీల డ్రామా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసిందని బహుశా టీడీపీ ముందే ఊహ

బీసీ రిజర్వేషన్లపై 2 పార్టీల డ్రామా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసిందని బహుశా టీడీపీ ముందే ఊహించి ఉండవచ్చని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ అన్నారు. బీసీలకు రాజ్యాంగ బద్ధ పదవుల్లో రిజర్వేషన్‌ రాజ్యాంగ ప్రాతిపదికతో ఇవ్వాలి తప్ప, పొలిటికల్‌ డ్రామా ప్రకారం ఇవ్వకూడదని ఇంతకు ముందు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 176 విషయంలో కూడా స్పష్టమయిందని గుర్తు చేశారు. నిజానికి ఈ రెండు పార్టీలకు బీసీలకు రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ ఇచ్చే ఉద్దేశమే లేదని విమర్శించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్‌ను కల్పించటానికి ఎలా అవకాశం ఉందో సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నా, బీసీ జనాభా, బీసీల వెనకబాటు అనే రెండింటికీ శాస్త్రీయ ప్రాతిపదికలు ఉన్నా చూపకుండా నిర్లక్ష్యంగా, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే, ఇక రాజ్యాధికారం తమ రెండు కులాల చేతుల్లో ఉండదన్న అభిప్రాయంతోనే ఫేక్‌ జీవోలు విడుదల చేసి రెండు పార్టీలు డ్రామా ఆడాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా దామాషాలో కనీసంగా 50 శాతం బీసీలకు; 19 శాతం ఎస్సీలకు; 6.8 శాతం ఎస్టీలకు స్థానిక సంస్థల సీట్లు కేటాయిస్తే.. మొత్తంగా 75.8 శాతం ఈ పేద వర్గాలకే కనీసం కింది స్థాయిలో రాజ్యాధికారంలో వాటా దక్కుతుందని సూచించారు. ఇలాంటి పరిస్థితిని టీడీపీ నాయకత్వంగానీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం గానీ ఏమాత్రం ఆమోదించే స్థితిలో లేవు కాబట్టే; 34 శాతం డ్రామా ఆడి... చివరికి 50 శాతం పరిధిలో మిగిలిన 24 శాతంతో సర్దుకోండి అంటూ ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ బీసీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల తర్వాత, దేశంలో తొలిసారిగా బీసీ కులాల గణన కూడా జరిగిందని, బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు దక్కేలా దేశ వ్యాప్తంగా బీసీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Scroll for the next article