Spiritual8th Sep 09:15 AMSunil Byrisetty1 min read
గ్రహణానంతరం తెరుచుకున్న ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం తర్వాత ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత వేకువజామున 2.40 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో
తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం తర్వాత ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత వేకువజామున 2.40 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం సంప్రోక్షణ పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి తర్వాత అర్చకులు ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుంచి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలు ప్రారంభమయ్యాయి.
సింహాచల దేవస్థానం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామికి చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ పూర్తి చేశారు. విశాఖ శ్రీకనక మహాలక్ష్మి ఆలయంలో సంప్రోక్షణ పూర్తి చేసి ఉదయం 9 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో కవాటోద్ఘాటనం గణపతి పూజ నిర్వహించారు. వేకువజాము నుంచి మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు తెరిచారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు సంప్రోక్షణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. గ్రహణం ముగిసినందున భద్రాద్రి రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. సుప్రభాత సేవ తర్వాత గోదావరి జలాలతో ఆలయాన్ని అర్చకులు శుద్ధి చేశారు.