News28th Aug 02:37 PMSunil Byrisetty1 min read
మూడు దశాబ్దాల వెలుగొండ కల సాకారం
ప్రకాశం ఉమ్మడి జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే మూడు దశాబ్దాల వెలుగొండ కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామ
ప్రకాశం ఉమ్మడి జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే మూడు దశాబ్దాల వెలుగొండ కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం విలువైన భూములు, ఆస్తులు, స్వగ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తుచేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 ఆగస్టు నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్దేశించారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పనుల కోసం సుమారు రూ.2,250 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే సమయానికి వెలుగొండ హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించిన వింగ్స్, వాల్స్ పనులు పూర్తికాని పరిస్థితి ఉండేదని చెప్పారు. 2025 మేలో పనులు ప్రారంభించి, 2026 మే నాటికి హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించిన వింగ్స్, వాల్స్ పనులను పూర్తి చేసినట్లు వివరించారు.