News6th Oct 12:38 PMSunil Byrisetty1 min read
ప్రేమ పేరుతో కండక్టర్ మోసం.. లైన్లోకి మంత్రి!
చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన ఎం. బేబీ శాలిని తనకు ఎదురైన సమస్యను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తాను చంద్రగిరి నుంచి తిరుపతి
చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన ఎం. బేబీ శాలిని తనకు ఎదురైన సమస్యను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తాను చంద్రగిరి నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సులో ప్రయాణించే క్రమంలో ఆర్టీసీ కండక్టర్ వి. సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ పరిచయాన్ని క్రమంగా పెంచుకున్న సుబ్రహ్మణ్యం తనను ప్రేమిస్తున్నానని నమ్మించి, తనను మోసం చేశాడని ఆరోపించారు. తన నుంచి సుమారు రూ.20 లక్షల వరకు నగదును తీసుకున్నాడని ఆరోపించారు. ఫోన్‌పే ద్వారా పలుమార్లు నగదు బదిలీ చేయించుకున్నాడని, తనతో బంగారం కూడా కొనిపించుకున్నాడని తెలిపారు. తన వద్ద నుంచి తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని వాపోయారు. ప్రేమిస్తున్నానని చెబుతూ తన వెంటపడి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. బాధితురాలు తన సమస్యను వివరించిన వెంటనే మంత్రి మండిపల్లి తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం (రీజినల్ మేనేజర్)కు వీడియో కాల్ చేసి సమస్యను వివరించారు. బాధితురాలి ఆరోపణలపై విచారణ జరిపి, సంబంధిత కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.