News4th Dec 03:17 PMSunil Byrisetty2 min read
పండుగ కావాల్సిన వ్యవసాయం.. చంద్రబాబు వల్ల దండుగైంది!
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగ
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘గత ఏడాది ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా తుఫానుకు నష్టపోయిన రైతుల ధాన్యం కొనేవాళ్ళు లేరు. దళారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అడుగుతున్నారు. దిత్వా తుఫాను పంట చేతికొచ్చే దశలో వస్తుందని 10 రోజుల ముందే తెలుసు. ఈ పంట కొనకుంటే ధాన్యం తడిసిపోతుంది అని తెలుసు. అన్నీ తెలిసినా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు తప్ప ఏమీ చేయటం లేదు. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసే వాళ్ళం, అన్నీ పనులు జరిగిపోయేవి. ఇవాళ రైతులు ఎలా పోయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఏ పంటకు రేట్లు లేవు, కేజీ అరటి అర్థ రూపాయి అంటే రైతులు ఎలా బ్రతుకుతారు. ఇంత ఘోరంగా పాలన చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. చీనీ రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపి పంట ఎగుమతి చేశాం. దళారులు లేరు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చాయి. రైతులకు 20 నుంచి 40 శాతం వరకు రేట్లు పెరిగాయి. చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. నిద్ర పోతున్నాడా?. ముఖ్యమంత్రిని చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా. రైతులను పట్టించుకోవాలి కదా. మా హాయంలో పులివెందులలో ప్రారంభించిన కోల్డ్ స్టోరేజ్ మూసేసారు. రైతులకు ఇచ్చిన హామీలు మోసపూరితమని అర్థమైంది’ అని జగన్ మండిపడ్డారు.